గ్లోబల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేసిన ‘వారణాసి’.. లాటిన్ అమెరికాలో టాలీవుడ్ కొత్త అడుగు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో ప్రపంచ సినీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు టాలీవుడ్ పెద్దగా ప్రవేశించని దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో బలమైన మార్కెట్‌ను ఏర్పరచడమే ఈ సినిమాకు ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
ఇటీవల మెక్సికోలో జరిగిన ప్రతిష్టాత్మక CCXP (కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్) వేడుకలో ‘వారణాసి’పై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి వీడియో సందేశం ద్వారా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా, సినిమా వెనుక ఉన్న పని తీరును చూపించే ప్రత్యేక విజువల్స్‌ను కూడా ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో ‘వారణాసి టు ది వరల్డ్’ పేరుతో ఒక ప్రత్యేక ప్యానెల్ కూడా ఏర్పాటు చేశారు.
మహేష్ బాబు ప్రధాన పాత్రలో ‘రుద్ర’ అనే సాహసికుడిగా కనిపించనున్న ఈ సినిమా, సుమారు 120 దేశాల్లో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కథ అంతర్జాతీయ నేపథ్యంతో సాగుతుండటంతో ప్రపంచ ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లాటిన్ అమెరికా మార్కెట్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ మెక్సికో తర్వాత బ్రెజిల్ సహా ఇతర దేశాల్లో కూడా ప్రమోషన్లు నిర్వహించేందుకు బృందం సిద్ధమవుతోంది. స్పానిష్ మాట్లాడే ప్రాంతాల్లో టాలీవుడ్ సినిమాపై ఇంత స్థాయి ఆసక్తి కనిపించడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా మేకింగ్‌లో కూడా హాలీవుడ్ తరహా వ్యూహాలను అనుసరిస్తున్నారు. బ్రాండ్లను కేవలం యాడ్స్‌గా కాకుండా కథలో భాగంగా చూపించేందుకు అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో సినిమాకు గ్లోబల్ లుక్ రావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడనున్నాయి.
ఓవర్సీస్ హక్కులకే సుమారు రూ.160 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒకే మార్కెట్ హక్కులకు వచ్చిన భారీ రేట్లలో ఒకటిగా చెప్పుకుంటున్నారు.
మే తొలి వారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం కలెక్షన్లు 10,000 కోట్ల వరకు చేరుతాయని మేకర్స్ అంచనా వేస్తుండటం పరిశ్రమలో ఆసక్తిని పెంచుతోంది.
రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు స్టార్ క్రేజ్ కలిస్తే ‘వారణాసి’ టాలీవుడ్‌ను గ్లోబల్ స్థాయిలో మరో మెట్టు ఎక్కించగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.