రాజమండ్రి చుట్టు ప్రక్కల పర్యాటక ప్రదేశాలలో ఒకటి మారేడుమిల్లి
రాజమహేంద్రవరం ( రాజమండ్రి ) చుట్టు ప్రక్కల చాల పర్యాటక ప్రదేశాలు వున్నాయి అందులో అందరు ఎక్కువగా వెళ్లే మరియు వెళ్లాలనుకునే ప్రదేశం మారేడుమిల్లి
రాజమహేంద్రవరం ( రాజమండ్రి ) చుట్టు ప్రక్కల చాల పర్యాటక ప్రదేశాలు వున్నాయి అందులో అందరు ఎక్కువగా వెళ్లే మరియు వెళ్లాలనుకునే ప్రదేశం మారేడుమిల్లి. ఈ ప్రదేశానికి కాలంతో సంభంధం లేకుండా నిత్యం పర్యాటకుల సందడి ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు అక్కడి పచ్చని ప్రకృతి , జలపాతాలు , వాగులు మరియు వంపులు తిరిగే దారి. ఈ ప్రయాణం లో మీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ మధ్యలో వచ్చే ప్రదేశాల అందాలతో ముందుకు సాగుతారు.
మారేడుమిల్లి రాజమండ్రి కి సుమారు 90 కి .మీ దూరంలో ఉంటుంది.మీరు రాజమండ్రి నుండి మీ సొంత వాహనాలు బైక్ , కార్ ద్వారా వెళ్ళవచ్చు లేదా ప్రైవేట్ వెహికల్స్ , ఆర్టీసీ బస్సు ద్వారా కూడా చేరుకోవచ్చు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లాలంటే 70 కి .మీ, మీరు ప్రవేట్ వెహికల్ ని హైర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బస చెయ్యడానికి అనేక రిసార్ట్స్ సదుపాయాలు కలవు.
మీరు రాజమండ్రి నుండి బయలు దేరి కోరుకొండ , గోకవరం మీదుగా సీతపల్లి చేరుకుంటారు అక్కడ పరాయణికులు బాపనమ్మ తల్లి గుడిని సందర్శించి కొంచం దూరంలో వున్నా సీతపల్లి వాగు దగ్గర కొంచం సేపు సేదతీరుతారు. అక్కడి నుండి కొంచం దూరం లో వున్న రంపచోడవరం చేరుకుంటారు, జంక్షన్ లో మెయిన్ రోడ్ నుండి లోపలీకి కొంచం దూరం వెళితే రంప వాటర్ ఫాల్స్ ఉంటాయి. మీరు ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే కొండపైకి కొంచం ట్రెక్కింగ్ చెయ్యవలిసి ఉంటుంది.
రంపచోడవరం నుండి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మీకు మార్గంలో భూపతిపాలెం డ్యామ్ బ్యాక్ వాటర్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు ఆగి చిత్రాలను తీసుకుంటారు, ఇక్కడ వీక్షణలు చాలా అందంగా ఉంటాయి.
అక్కడి నుండి బయలుదేరి 20 కి. మీ దూరంలో మనకి మారేడుమిల్లి వస్తుంది. మారేడుమిల్లి లో బస చెయ్యడానికి ఏపీ టూరిజం రిసార్ట్స్ తో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ సదుపాయం కలదు. మారేడుమిల్లి లో అనేక సినిమా షూటింగ్స్ జరిగాయి ముఖ్యంగా గుడిస అనే ప్రదేశం లో పుష్ప సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రదేశం మారేడుమిల్లి కి 40 కి. మీ దూరంలో వుంది, ఇక్కడ చాలామంది ప్రకృతి ప్రేముకులు నైట్ స్టే చేసి తెల్లవారుజామున ఇక్కడి ప్రకృతి దృశ్యాలని ఆస్వాదిస్తారు.
మారేడుమిల్లి కి దగ్గరలో 2 జలపాతాలు కలవు అందులో ఒకటి జలతరంగిణి వాటర్ ఫాల్ మరొకటి అమృతధార జలపాతం. అలా ముందుకు భద్రాచలం దారిలో ముందుకు వెళితే మీకు వ్యూ పాయింట్స్ తో పాటూ వంపులు తిరుగుతూ రహదారి మీకు కొత్త అనుభూతులు ఇస్తుంది.
అలా ఆ దారిలో ముందుకు సాగగా మీకు సోకులేరు వాగు వ్యూ పాయింట్ దర్శనం ఇస్తుంది. అక్కడ ముందుకు వెళ్ళితే మీకు వాగు వైపు క్రిందికి దారి ఉంటుంది. అక్కడ వాగు వడ్డున మీరు ఆహ్లాదంగా గడపవచ్చు . (గమనిక : వాగులో దిగుట ప్రమాదం అక్కడ జాగ్రత్త వహించడం చాల ముఖ్యం ).
మీకు ఇంకా సమయం వుంది వేరే జలపాతాలు చుడాలిని ఉంటే అక్కడికి 35 కి. మీ దూరంలో పొల్లూరు దగ్గర టైగ్రిస్ వాటర్ ఫాల్స్ ఎంతో సుందరంగా ఉంటుంది .